Sumathi Neethi Padyaalu
వేసరవు జాతి కానీ
వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ
దాసి కొడుకైన గాని
కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!
తాత్పర్యం: నీచ జాతివాడైనా, నిష్ప్రయోజకుడైనా, దాసీ పుత్రుడైనా ధనం కలవాడే అధిపతి
వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్
గలలోఁన గన్న కలిమియు,
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!
తాత్పర్యం: వేశ్య ప్రమాణాలు, విశ్వబ్రాహ్మణుని స్నేహం, వెలమదొరల జత, కలలో చూసిన సంపదలను స్పష్టంగా నమ్మరాదు.
వెలయాలివలనఁ గూరిమి
గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా
పలువురు నడిచెడి తెరుపునఁ
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!
తాత్పర్యం: పదిమంది నడిచే బాటలో పచ్చగడ్డి మొలవదు. ఒకవేళ మొలిచినా పెరగదు. ఆ విధంగానే వేశ్యవల్ల ప్రేమ లభించదు. ఒకవేళ లభించినా ఎక్కువకాలం నిలవదు.
వీడెము సేయని నోరును
జేడెల యధరామృతంబుఁ జేయని నోరును
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!
తాత్పర్యం: తాంబూలం వేసుకోని, స్త్రీల అధరామృత పానం చేయని, గానం చేయని నోరు పెంట బూడిద పోసుకొనే గోయితో సమానం సుమా!
వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ!
తాత్పర్యం: ఎవరు ఏం చెప్పినా వినవచ్చు. విన్నా వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలించి అది నిజమో అబద్దమో తెలుసుకొన్న మనిషే ధర్మాత్ముడు.
వరి పంటలేని యూరును
దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్
ధరను బతిలేని గృహమును
అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
తాత్పర్యం: ధాన్యం పంటలేని గ్రామం, రాజు నివశింపని నగరం, సహాయం దొరకని మార్గం, భర్త (రాజు)లేని గృహం ఆలోచించగా స్మశానంతో సమానమని చెప్పవచ్చు.
వరదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడకేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!
తాత్పర్యం: వరద ముంచిన చేనును దున్నవద్దు. కూడు కరవైనను బంధువుల ఇంటికి పోవద్దు. ఇతరులకు రహస్యాల్ని చెప్పవద్దు. పిరికివాడికి సేనానాయక పదవిని ఇయ్యవద్దు.
లావుగలవానికంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!
తాత్పర్యం: పెద్ద పర్వతమంటి ఏనుగుకంటే చిన్నవాడైన మావటి లోబరుచుకుని ఎక్కుచున్నాడు కనక మావటి గొప్పవాడు. అలాగే శరీరబలం కలవాని కంటే బుద్ధిబలం కలవాడే నిజమైన బలవంతుడు.
రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించురాజుఁ గొల్వకు
పాపుదేశంబు సొరకు పదిలము సుమతీ!
తాత్పర్యం: సాక్షులతో నిర్ధారణ చేసి అబద్ధాన్ని నిజమని స్థిరపరచడం, ఆప్తబంధువులను నిందించడం, కోపిని సేవించడం, పాపభూమికి వెళ్లడం తగని పనులు. కావున ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
రా పొమ్మని పిలువని యా
భూపాలునిఁ గొల్వ ముక్తి ముక్తులు గలవే
దీపంబు లేని ఇంటను
చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ!
తాత్పర్యం: దీపంలేని ఇంట్లో చేవుణికీళ్లాట ఆడితే ఏవిధంగా ఆనందం కలగదో ఆ విధంగానే రమ్మని కానీ పొమ్మని కానీ చెప్పని రాజును సేవించడం వల్ల జీవమూ లేదు. మోక్షమూ లేదు. వట్టి నిష్ప్రయోజనం.
నాది నొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్
బొది జిలుక పిల్లి పట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ!
తాత్పర్యం: పిల్లి పంజరాన్ని పట్టుకుంటే ఆ పంజరంలో ఉన్న చిలుక మాట్లాడుతుందా? అలాగే, మనసులో ఒకతన్ని ప్రేమించిన స్త్రీ విటుడు ఎంత బతిమాలినా ప్రేమించదు.
మానఘనుఁ డాత్మధృతిఁ జెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలములలోపల
నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!
తాత్పర్యం: అభిమాన శ్రేష్టుడు మనోధైర్యం చెడి అల్పుని ఆశ్రయించడం మానెడు నీళ్లలో ఏనుగు తన శరీరాన్ని మరుగుపరచినట్లుండును.
మాటకు బ్రాణము సత్యము
కోటకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
తాత్పర్యం: నోటిమాటకు సత్యం, పెద్ద దుర్గానికి గొప్ప సైన్య సమూహం, స్త్రీకి అభిమానం, పత్రానికి చేవ్రాలు ముఖ్యమైన ఆధారాలు.
మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలచుఁ దరచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ!
తాత్పర్యం: సమర్థుడైన మంత్రి ఉంటే సామ, దాన, భేద, దండ వంటి ఉపాయాలు పాడుకాకుండా సాగిపోతాయి. అలాంటి మంత్రి లేకపోతే కీలూడిపోయిన యంత్రంలా ముందుకు సాగవు.
మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచుర సుమతీ!
తాత్పర్యం: కొండంత పెద్దదైన ఏనుగు అయినా తొండం లేకపోతే ఎలా శోభావిహీనంగా ఉంటుందో అలాగే, గొప్ప దేశాన్ని పరిపాలించే రాజు దగ్గర సమర్థుడైన మంత్రి లేకపోతే అతని పాలన అంతే శోభావిహీనమవుతుంది.
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!
తాత్పర్యం: నేను చాలా బలవంతుడ్ని. నాకేమీ భయం లేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి విరోధం తెచ్చుకోవడం మంచిది కాదు. అది ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగిన సర్పం కూడా చలిచీమలకు లోబడి చావడం లేదా?
Post a Comment