Here is Images for sumathi satakam padyalu,Kokkoka Mella Sumathi Padyam with Bhavam,sumathi satakam in telugu images,sumathi satakam in telugu,sumati padyalu,Telugu Padyaalu Sumathi Satakam History,Sumathi Satakam Lyrics In telugu,sumathi satakam in telugu pdf,sumathi satakam telugu,sumathi satakam mp3,sumathi satakam in english lyrics,sumathi satakam poems in telugu,sumathi satakam writer name,sumathi padyalu in telugu mp3,vemana padyalu in telugu with meaning pdf,sumathi satakam in telugu pdf,sumathi satakam in telugu pdf free download,sumathi satakam in telugu script pdf,sumathi satakam poems in telugu pdf,sumathi satakam poems in telugu with bhavam
శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులునౌరాయనగా
ధారాళమైననీతులు
నోరూరగ చవులువుట్ట నుడివెద సుమతీ!
ఇది బద్దెన రచించిన సుమతీ శతకంలోని మొట్టమొదటి పద్యం. శతకం కాని, ఏదైనా కావ్యం కాని రాసేటప్పుడు మొదటి పద్యాన్ని సర్వసాధారణంగా శ్రీ తో మొదలుపెడతారు. అలాగే మొట్టమొదటి పద్యంలో దైవస్తుతి ఉంటుంది. బద్దెన రాసిన ఈ శతకంలో ప్రతిపద్యం చివరసుమతీ అనే మకుటం వస్తుంది. బద్దెన పద్యంలో తన పేరును పెట్టుకోకుండా రాశాడు ఈ శతకాన్ని. ‘సుమతీ’ అంటే ‘మంచి బుద్ధికలవాడా!’ అని అర్థం.
భావం: మంచిబుద్ధిగలవాడా! మీకు కొన్ని నీతులు చెబుతాను, వినండి. ఈ నీతులు నేను చెబుతున్నానంటే అందుకు నా ఇష్టదైవమైన శ్రీరాముని అనుగ్రహమే కారణం. నేను చెప్పబోయేవన్నీ రానున్న కాలంలోనూ ప్రసిద్ధికెక్కుతాయి. అవి ఎవరూ అడ్డుచెప్పలేనిఉత్తమమైనవి. ఒకటి వింటే మరొకటి వినాలనిపించేలా ఉంటాయి. ఎంతో ఉపయోగకరమైనవి కూడా. ఈ నీతులు విన్నవారు చెప్పే విధానం బాగుంది అని ఆశ్చర్యపోతారు.
ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సుమతీశతకంలోని కొన్ని పద్యాలనైనా కంఠతా చేయాలి. అంతేకాకుండా అందులోని మంచిని ఆచరించాలి.
కొఱగాని కొడుకుపుట్టిన
కొఱగామియె కాదు తండ్రి గుణములు చెరచున్
చెఱకు తుద వెన్ను పుట్టిన
చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతీ!
సుమతీ శతకాన్ని రాసిన బద్దెన తన శతకంలో అనేక విషయాలను అందరికీ అర్థమయ్యే భాషలో తెలియచేశాడు. ఈ పద్యంలో అప్రయోజకుడయిన కుమారుడి గురించి వివరించాడు.
భావం: ప్రయోజకుడు కాని కొడుకు పుడితే, అతడు ప్రయోజకుడు కాకపోవటమే కాకుండా, తండ్రిలో ఉన్న సుగుణాలకు చెడ్డపేరు తీసుకువస్తాడు. చెరకుగడ చివర కంకి మొలిస్తే, మొలిచిన చోట తీపి ఉండదు. అక్కడ లేకపోవటమే కాక, గడలో ఉన్న తీపినంతటినీ కూడా ఈకంకి చెడగొడుతుంది. ఇది ప్రపంచమంతటా ఉన్న సత్యం.
కొఱగాని కొడుకు అంటే ఏపనీ చేతకానివాడు, నేర్చుకోని వాడు, ఏ పనీ చేయనివాడు అని అర్థం. ఇలాంటివారినే అప్రయోజకులు అని కూడా అంటారు. కొందరు పిల్లలు ఏ పనీ చేయకుండా, బద్దకంగా, సోమరిగా ఉంటారు. అంతేకాక పనికిమాలిన పనులు అంటే చేయకూడనిపనులు చేస్తూ, తండ్రి పేరు చెడగొడతారు. అందరిచేత చివాట్లు తింటారు. అటువంటి కుమారుడిని చెరకులో పుట్టిన వెన్నుతో పోల్చి చెప్పాడు బద్దెన. ప్రపంచంలో ఉండే నిజాలు తెలిస్తేనే కాని ఇటువంటి వాటితో పోలిక చెప్పలేరు.
నడువకుమీ తెరువొక్కట
కుడువకుమీ శత్రునింట కూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
మానవులంతా జీవితంలో ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో అనే విషయాన్ని బద్దెన తన సుమతీ శతకంలోని ఈ పద్యంలో వివరించాడు.
భావం: మంచిబుద్ధిగలవాడా! ఎవరో ఒకరు పక్కన తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దు. శత్రువు ఇంటికి వెళ్లినప్పుడు, తినడానికి ఏవైనా పదార్థాలను స్నేహంగా పెట్టినప్పటికీ ఏమీ తినవద్దు. ఇతరులకు సంబంధించిన ఏ వస్తువునూ తీసుకోవద్దు. ఇతరుల మనసుబాధపడేలాగ మాట్లాడవద్దు. పూర్వం ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే అడవులు దాటి వెళ్లవలసి వచ్చేది. అలాగే శుభ్రంచేసిన దారులు కూడా తక్కువగా ఉండేవి. అందువల్ల పాములు, క్రూరమృగాలు, దోపిడీదొంగలు - వీరి బాధ ఎక్కువగా ఉండేది. ప్రజలందరూ గుంపులుగా ప్రయాణాలు చేసేవారు. ఒంటరిప్రయాణం మంచిది కాదు.
శత్రువు ఇంటికి వెళ్లవలసి వచ్చినప్పుడు, అక్కడ వారు ఎంత ప్రేమగా ఏ పదార్థం పెట్టినా తినకుండా వ చ్చేయాలి. ఎందుకంటే శత్రువు తన పగ తీర్చుకోవటానికి ఆహారంలో విషంవంటివి కలిపే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏమీ తినకుండా వచ్చేయాలి. ఇతరులమనసులను బాధపెట్టేలా మాట్లాడటం వలన వారి మనసు విరిగిపోతుంది. ఇంక ఎప్పటికీ మనతో సరిగా మాట్లాడలేరు. ఈ మూడు సూత్రాలను పాటించడం ప్రతిమనిషికీ అవసరమని బద్దెన చక్కగా వివరించాడు.
లావుగలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!
భావం: మంచిబుద్ధికలవాడా! శరీర బలం ఉన్నవాని కంటె తెలివితేటలు ఉన్నవాడు అందరికంటే బలవంతుడు. పర్వతమంత ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగదీసి దానిమీదకు ఎక్కగలడు. కండలు తిరిగి, శరీరం దృఢంగా ఉండిబలవంతులైనవారు చాలామంది ఉంటారు. అలాగే బాగా చదువుకుని తెలివితేటలు సంపాదించుకున్న నీతిమంతులు కూడా ఉంటారు.
అయితే వీరి శరీరం దృఢంగా ఉండకపోవచ్చు. కాని వారికున్న తెలివితేటలతో దేహబలం ఉన్నవారి కంటె బలవంతులుగా ఉంటారు సంఘంలో. ఏనుగు కొండంత ఉంటుంది. జంతువులన్నిటిలోకీ శరీరబలం ఉన్నది ఏనుగు మాత్రమే. మరే ప్రాణికీ అంత బలం లేదు. మావటివాడు ఏనుగు పరిమాణంలో పదోవంతు కూడా ఉండడు. అయినప్పటికీ కొండంత ఉన్న ఏనుగును మావటివాడు (ఏనుగుల సంరక్షకుడు) తన దగ్గరుండే అంకుశం (చిన్న కత్తివంటి ఆయుధం) తో లొంగదీసుకుని దాని మీద ఎక్కి కూర్చోగలుగుతున్నాడు. దీనికికారణం అతనికి ఉన్న తెలివితేటలు. తెలివితేటలకుండే శక్తి గురించి బద్దెన ఈ విధంగా వివరించాడు.
బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతచిక్కి చావదె సుమతీ!
తమకు చాలా బలం ఉంది అని గర్వంతో విర్రవీగేవారి గురించి వర్ణిస్తూ బద్దెన ఈ పద్యాన్ని చెప్పాడు.
భావం: మంచిబుద్ధికలవాడా! తనకు శక్తి ఉంది కనుక, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనుకునేవారు కొందరు ఉంటారు. వారు ఇతరులందరినీ తీసిపారేసినట్లు మాట్లాడతారు. అందువల్ల వారికి మంచి కలుగదు. ఎంతోబలం ఉన్న పాము అన్నిటికంటె చిన్నప్రాణులైనచీమలకు దొరికిపోయి, ప్రాణాలు పోగొట్టుకుంటుంది.
ప్రపంచంలో చాలామంది తమకు చాలా బలం ఉందని, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనే అహంకారంతో ఉంటారు. ప్రతివారితోనూ అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఎవరు పలకరించినా వారిని తక్కువగా చూస్తూ హేళనగా మాట్లాడతారు. తలనిండా విషం ఉన్న పామును సైతం అతిచిన్నవైన చీమలన్నీ క లిసి చంపేస్తాయి. పాములతో పోలిస్తే చీమలకు బలం కాని శక్తి కాని లేదు. అయినప్పటికీ ఐకమత్యం గల కొన్ని చీమలు కలిసి ఆ విషసర్పాన్ని చంపుతాయి. ఇది లోక ంలో ఉన్న వాస్తవం. అటువంటి వాస్తవంతో పోల్చి, మనుషుల ప్రవర్తననువివరించాడు బద్దెన తన సుమతీ శతకంలో.
వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలోసుమతీ!
భావం: మంచిబుద్ధికలవాడా! ఎవరు ఏమి చెప్పినా దానిని శ్రద్ధగా వినాలి. అయితే విన్న వెంటనే తొందరపడి ఒక నిశ్చయానికి రాకూడదు. బాగా ఆలోచించి తెలుసుకొని, ఆ చెప్పిన విషయం అసత్యమో, సత్యమో అని ఎవరు తెలుసుకుంటారో వారు నీతి తెలిసినవారు.
సుమతీ శతకంలో ఇది బాగా ప్రసిద్ధిచెందిన పద్యం. తరచుగా ఈ పద్యాన్ని అందరూ వాడుతుంటారు. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు దానిని శ్రద్ధగా వినాలి. అవతలి వారికేం తెలియదు అనుకోకూడదు. విన్న తరవాత తొందరపడి ఆ విషయం మీద ఒకనిర్ణయానికి రాకూడదు. వారు చెప్పిన విషయంలో ఎంత నిజం ఉందో, ఎంత అబద్ధం ఉందో ముందుగా తెలుసుకోవాలి. ఎవరైతే అలా తెలుసుకోగలుగుతారో వారిని నీతిపరులుగా చెప్తారు. తొందరపాటుతనం ఉండకూడదని బద్దెన ఈ పద్యం ద్వారా నీతిని బోధించాడు. తొందరపడి నిర్ణయం తీసుకుంటే అప్పుడు నష్టపోవడమేకాక, ఆ తరవాత కూడా బాధపడవలసి ఉంటుంది.
సిరిదా వచ్చిన వచ్చును
సరసంబుగ నారికేళ సలిలము భంగిన్
సిరిదా పోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
భావం : ఓ బుద్ధిమంతుడా!
ఎవరికైనా సరే సంపదలు ఏ విధంగా వస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఎలాగంటే కొబ్బరికాయలోకి తియ్యటి నీళ్లు ఎక్కడి నుంచి ప్రవేశిస్తాయో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ధనం అదేవిధంగా వస్తుంది. అలాగే వెలగపండులో ఉన్న గుజ్జు మాయమైపోయి కాయ మాత్రం చక్కగాఉంటుంది. బయట నుంచి చూస్తే అది గుజ్జు నిండిన కాయలాగే ఉంటుంది. ఎక్కడా రంధ్రం కాని పుచ్చుకాని ఉండదు. అయితే అందులోకి కరి అనే ఒకరకమైన పురుగు చేసి లోపల ఉన్న గుజ్జు తినే సి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతారు. కరి అనే ఒకరకమైన వ్యాధివచ్చినప్పుడు లోపల గుజ్జు పోతుందని మరికొందరు చెప్తారు. ఏది ఏమైనా వెలగపండులో ఉన్న గుజ్జు మాత్రం పూర్తిగా ఖాళీ అయిపోతుంది. అదేవిధంగా ఒకవ్యక్తి దగ్గర నుంచి ధనం కూడా అలాగే వెళ్లిపోతుంది. ఇందులో బద్దెన లోకంలో ఉన్న వాస్తవాన్ని తీసుకుని ధనంఎలావచ్చిపోతుందో వివరించాడు. నారికేళమంటే కొబ్బరికాయ, సలిలమంటే నీరు, కరి అంటే ఏనుగు, భంగిన్ అంటే విధంగా అని అర్థం.
అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బాఱని గుర్రము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!
అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఏవో ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. అటువంటి సమయంలో బంధువులు వారికి చేతనైన సహాయం చేయాలి. అలా చేయనివారు బంధువులు కారు. అటువంటివారిని దూరంగా ఉంచాలి... అని చెబుతూ ఎటువంటివాటిని దూరంగా ఉంచాలోమరికొన్ని ఉదాహరణలు ఈ పద్యంలో ఉన్నాయి.
భావం: ఓబుద్ధిమంతుడా! కష్టాలలో ఉన్నప్పుడు సహాయపడని బంధువును తొందరగా దూరం చేసుకోవాలి. అలాగే ఆపదలు కలిగినప్పుడు, మొక్కుకున్నప్పటికీ దేవతలు కరుణించపోతే, ఆ దేవతను పూజించటం వెంటనే మానేయాలి. అలాగే యుద్ధాలలోఉపయోగించటం కోసమని రాజుల వంటివారు గుర్రాలను పెంచుకుంటారు. యుద్ధరంగంలో శత్రువు మీదకు దాడికి వెళ్లడంకోసం ఆ గుర్రాన్ని ఎక్కినప్పుడు అది పరుగెత్తకపోతే దానిని కూడా వెంటనే వదిలివెయ్యాలి.
‘అక్కరకు రావటం’ అంటే అవసరానికి ఉపయోగపడడం, వేల్పు అంటే దేవుడు, గ్రక్కున అంటే వెంటనే అని అర్థం. ఇందులో గ్రక్కున అనే పదం అన్నిటికీ సంబంధించినది. అవసరానికి ఉపయోగపడని బంధువును, దేవతను, గుర్రాన్ని... ఈ మూడిటినీ వెంటనే విడిచిపెట్టాలిఅని సుమతీ శ తకం రచించిన బద్దెన వివరించాడు.
అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము,
జొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!
బుద్ధిమతీ! అవసరానికి డబ్బు అప్పుగా ఇచ్చేవాడు, జబ్బుచేయకుండా లేదా జబ్బు చేసినప్పుడు చికిత్స చేసే వైద్యుడు, తాగటానికి అవసరమయిన నీటినిచ్చే జీవనది, పెళ్లి వంటి శుభకార్యాల సందర్భాలలో పూజలు చేయించేందుకు బ్రాహ్మణుడు... ఈ సౌకర్యాలు లభించేఊరిలో మాత్రమే నివసించాలి. ఇవి లేని ఊరిలోకి ప్రవేశించకూడదు.
భావం: ఒక గ్రామంలో మనుషులు నివసించాలంటే కొన్ని అంశాలు తప్పనిసరి. మొదటిది... అవసరానికి ఆదుకుని అప్పుగా డబ్బు ఇచ్చేవాడు. కష్టాలు అనుకోకుండా వస్తాయి. ఆ సమయంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది. వెంటనే ఆదుకునే వాడు తప్పనిసరి. ఇకరెండవది... వైద్యుడు.
ప్రాణాంతకమైన అనారోగ్యాలు కలిగిన సమయంలో డాక్టరు వెంటనే తగిన చికిత్స చేస్తే ఆ మనిషి ప్రాణం నిలబడుతుంది. డాక్టరు అందుబాటులో లేకుండా దూరంగా ఉంటే, రోగిని తీసుకు వెళ్లేలోపే ప్రాణం పోవచ్చు. అందుకని డాక్టరు చాలా అవసరం. మూడవది... మంచినీరుగల నది. నీరు లేకుండా మనిషి జీవించడం కష్టం. అందువల్ల నివసించే ప్రాంతంలో నీరు తప్పనిసరి. ఇక చివరగా... అన్ని రకాల కర్మలుచేసే బ్రాహ్మణుడు. ఏ ఇంట్లోనైనా మంచి కాని చెడు కాని జరిగితే దానికి కావలసిన పూజలు చేయటానికి బ్రాహ్మణుడు తప్పనిసరి... అనిబద్దెన వివరించాడు.
ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!
భావం: బుద్ధిమతీ! తనకు మేలు చేసిన వారికి ఎవరైనా తిరిగి మేలుచేస్తారు. అది ప్రకృతి లో సర్వసాధారణం. అలాచేయడంలో పెద్ద విశేషమేమీలేదు. తనకు కీడు చేసినవానికి మేలు చేయడం, అది కూడా ఏ తప్పును ఎత్తిచూపకుండా చేసేవాడు నేర్పు కలవాడు.
ఇతరులు ఎవరైనా సహాయం కోరినప్పుడు మనం వారికి సహాయం చేస్తుంటాం. మళ్లీ మనకు అవసరం వచ్చినప్పుడు వారు తిరిగి సహాయం చేస్తారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. ఎందుకంటే ఇది అందరూ చేసేదే. మనకు సహాయం చేసిన వారి రుణం తీర్చుకోవడంకోసం ఇలా చేస్తారు. అలాకాక మనకు ఎవరో ఒకరు అపకారం చేసినవారుంటారు. వారికి ఎప్పుడో ఒకప్పుడు మన అవసరం వస్తుంది. అటువంటప్పుడు మనం వారు చేసిన తప్పును ఎత్తిచూపుతూ వారికి సహాయం చేయకుండా ఉండకూడదు. వారు తెలియక తప్పుచేశారులే అని మంచిమనసుతో భావించి, ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. అటువంటివారే నేర్పరులవుతారని బద్దెన ఈ పద్యంలో వివరించాడు.
అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ!
భావం : అప్పు చేసి ఆస్తి సంపాదించవచ్చు. ఔదార్యం ప్రదర్శించి దానం చేయవచ్చు. అదేవిధంగా ఉన్నతస్థితిని, దర్పాన్ని ప్రదర్శించవచ్చు. తాను ముసలివాడై ఉండి వయసులో బాగా చిన్నదైన యువతిని వివాహం చేసుకోవచ్చు. మూర్ఖుడైన వాడు మునులలాగ తపస్సుచేయవచ్చు. తప్పుచేసిన దోషిలోని తప్పును ప్రజలను పరిపాలించే పాలకుడు గమనించకపోవచ్చు. అయితే ముందుముందు అంటే తరువాతి కాలంలో ఈ సంపద, దాతృత్వం, పడుచుభార్య, తపస్సు, దోషాన్ని పసిగట్టని రాజు... ఇవన్నీ కీడును తీసుకువస్తాయి.
ప్రతిపదార్థం: సుమతీ అంటే మంచిబుద్ధిగలవాడా! అప్పు + కొని అంటే ఇతరుల దగ్గర అప్పు చేసి. చేయు విభవము అంటే సంపాదించిన ఆస్తి, ఆ ఆస్తితో చేసేదానం, దాని కారణంగా అనుభవించే హోదా. ముప్పునన్ అంటే ముసలితనంలో. ప్రాయము + ఆలు అంటేయౌవనంలో ఉన్న భార్య. మూర్ఖుని తపమున్ అంటే మూర్ఖుడైనవాడు (తనకు తోచని, ఇతరులు చెబితే వినని) చేసే తపస్సూ. తప్పు + అరయని అంటే తప్పు చేసిన వ్యక్తిలో ఉన్న దోషాన్ని గమనించని. నృపు అంటే రాజు యొక్క. రాజ్యము అంటే పరిపాలన. ఇవన్నీకూడా... మీదన్ అంటే తరువాతి కాలంలో. దెప్పరము + ఐ అంటే ఆపద, కష్టం కలిగించేవిగా మారి. కీడు అంటే వినాశనాన్ని లేదా కీడును. తెచ్చున్ + ర అంటే తీసుకుని వస్తాయి నాయనా!
ఈ పద్యంలో ఏయే పనులు చేయకూడదో సూచించాడు కవి. ఈ సూచనలను పాటించినవారు బుద్ధిమంతులుగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటారనేది ఈ పద్యం అంతరార్థం.
ఆకొన్నకూడె యమృతము
తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడె మనుజుడు
తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ
భావం : ఈ భూమి మీద బాగా ఆకలివేసినప్పుడు తిన్న అన్నమే అమృతం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు. అలాగే ఎప్పుడైనా కష్టాలు కలిగితే వాటిని ఓర్చుకోగలవాడే నిజమైనమానవుడు. ధైర్యం ఉన్నవాడే వంశానికి మంచి పేరు తేగలుగుతాడు.
ప్రతిపదార్థం : ధరిత్రిన్ అంటే భూమి మీద. ఆకొన అంటే బాగా ఆకలివేసినప్పుడు దొరికిన. కూడు + ఎ అంటే అన్నమే. అమృతం అంటే అమృతంతో సమానం. (ఆ అన్నం ఎంతో రుచిగా ఉంటుంది). తాకు + ఒందకన్ అంటే విసుగుకోకుండా. ఇచ్చువాడు + ఎ అంటే దానంచేసేవాడే . దాత అంటే నిజమైన దానశీలుడు. సోకు + ఓర్చువాడు + ఎ అంటే ఇబ్బందులు కలిగినప్పుడు వాటిని తట్టుకోగలవాడే. మనుజుడు అంటే నిజమైన మనుష్యుడు. తేకు అంటే ధైర్యం. కలవాడు + ఎ అంటే ఉన్నవాడే. వంశతిలకుడు అంటే వంశానికి పేరుప్రఖ్యాతులు తెచ్చేవాడు.
ఈ పద్యంలో మనిషికి ఉండవలసిన కొన్ని మంచి లక్షణాలను వివరించాడు కవి. ఆ లక్షణాలను అలవరచుకుంటే మానవ జీవితం ఎటువంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా నడుస్తుంది. అందుకే వీటిలో కొన్నిటినైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
ఇమ్ముగ జదువని నోరును
నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్
తమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
భావం: మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి. కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతో దగ్గరకు రమ్మని పిలవాలి. ఈ పనులనన్నిటినీ నోటితోనే చేయాలి. ఈ మూడు పనులనూసరిగా చేయని నోరు... కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది.
ప్రతిపదార్థం: ఇమ్ముగన్ అంటే బాగుగా. చదువని అంటే చదువుకోని. నోరును అంటే నోరు. అమ్మా + అని అంటే తల్లీ అని పిలిచి. అన్నము అంటే అన్నం పెట్టమని. అడుగని అంటే కోరనటువంటి. నోరున్ అంటే నోరు. తమ్ములన్ అంటే తనకంటె చిన్నవారైన సోదరులను. పిలువని అంటే ప్రేమగా దగ్గరకు రమ్మనమని. నోరును అంటే నోటిని. కుమ్మరి అంటే కుండలు చేసేవాని. మను అంటే మన్ను. త్రవ్వినట్టి అంటే తవ్విన తరువాత ఏర్పడిన. గుంటర అంటే చిన్నగోతితో సమానం.
మానవులకు మాత్రమే నోటితో మాట్లాడే శక్తి ఉంది. ఆ శక్తిని మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలని ఈ పద్యంలో చెబుతున్నాడు కవి.
ఉత్తమ గుణములు నీచున
కెత్తెరగున గలుగనేర్చు? నెయ్యెడలం దా
నెత్తిచ్చి కరగ బోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!
భావం : గొప్పవారికి మంచిగుణాలు సహజంగానే అలవడతాయి. అల్పులు ఎంత ప్రయత్నించినా ఆ గుణాలు వారికి అలవడవు. ఇత్తడి గొప్పదని భావించి, విలువ ఏర్పడేలా చేయాలనే తలంపుతో దానిని కర గించి అచ్చుగా పోసినా అది బంగారం కాలేదు.
ఇలలోన్ అంటే ఈ భూమి మీద. నీచునకున్ అంటే దుష్టస్వభావం కలవానికి. ఉత్తమగుణములు అంటే గొప్పవి అయిన సుగుణాలు. ఎత్తెరగున అంటే ఏవిధంగా. కలుగనేర్చున్ అంటే అలవాటు చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎయ్యెడలన్ అంటే ఏ ప్రాంతంలోనైనా. ఎత్తిచ్చిఅంటే గొప్పదాన్ని. కరగి అంటే ద్రవరూపంలోకి మారేటట్ల్లు కాచి. పోసినన్ అంటే అచ్చులో పోసినప్పటికీ. ఇత్తడి అంటే ఒకానొక లోహం. తాను అంటే అది. బంగారము అంటే స్వర్ణం. అగునె అంటే కాగలదా.
ఇత్తడి, బంగారం చూడటానికి ఒకే తీరులో ఉంటాయి. కాని బంగారానికున్న విలువ ఇత్తడికి లేదు. అదేవిధంగా మంచి గుణాలు కలవారికి ఉండే సంస్కారం చెడు గుణాలు ఉన్నవారికి కలుగదు అని కవి వివరించాడు.
ఉడుముండదె నూరేండ్లును
బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్
మడువున గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!
భావం : ఈ ప్రపంచంలో పుట్టిన తరువాత మనిషి పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలు సాధించటానికి తమ వంతు కృషి చేయాలి. అలా కృషిచేయనివాని బతుకు నిరర్థకం. ఉడుము వంద సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, చెరువులో కొంగ చాలా కాలంబతుకుతున్నాయి. కాని ఆ బతుకువల్ల వాటికి ఏమి ప్రయోజనం కలుగుతోంది? పురుషార్థాలను సాధించనివాని జీవితం కూడా ఇటువంటిదే అవుతుంది.
ఉడుము అంటే బల్లి ఆకారంలో దానికంటె ఎన్నో రెట్లు పెద్దదిగా ఉండే జంతువు. నూరేండ్లును అంటే వంద సంవత్సరాలు. ఉండ దె అంటే జీవించదా. పాము అంటే సర్పం. పేర్మిన్ అంటే ఎంతో గొప్పగా. పది నూరేండ్లున్ అంటే వెయ్యి సంవత్సరాలైనా. పడి ఉండదె అంటేనిష్ర్పయోజనంగా జీవించి ఉండదా. కొక్కెర అంటే కొంగ. మడువునన్ అంటే చెరువులో. ఉండదె అంటే జీవించి ఉండదా. మానవుడు... ఇలన్ అంటే భూలోకంలో. కడున్ అంటే మిక్కిలి. పురుషార్థపరుడు అంటే పురుషార్థాలయిన ధర్మార్థ కామ మోక్షాలపై ఆసక్తి కలవాడు. కావలెన్ అంటే అయి ఉండాలి.
ఈ పద్యంలో మనిషి ధర్మబద్ధంగా ఉంటూ ధనాన్ని సంపాదించుకోవాలి, కోరికలు నెరవేర్చుకోవాలి, చివరకు మోక్షం పొందాలని వివరించాడు కవి.
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ
ఎప్పటికిన్ + ఏ + అది అంటే ఆయా సందర్భాలను బట్టి. ఎయ్యది అంటే ఏ మాట. ప్రస్తుతం అంటే అనుకూలంగా ఉండి మన్నన పొందుతుందో. (ఏ సమయంలో ఏ మాట మాట్లాడితే అక్కడ గౌరవమర్యాదలు కలుగుతాయో). అప్పటికిన్ అంటే ఆసమయానికి.
ఆ మాటలు అంటే అటువంటి పలుకులు. ఆడి అంటే పలికి. అన్యులమనముల్ అంటే ఇతరుల మనసులను. నొప్పింపక అంటే బాధపడేటట్లు చేయక. తాన్ అంటే తాను కూడా. నొవ్వక అంటే బాధపడవలసిన స్థితి కల్పించుకుని బాధపడకుండా. (తన మాటలకు ప్రతిగా ఇతరులు తన మనసు కష్టపెట్టేలా మాట్లాడనివ్వకుండా). తప్పించుక అంటే అటువంటి పరిస్థితులను తొలగించుకొని. తిరుగువాడు అంటే ప్రవర్తించే వ్యక్తి. ధన్యుడు అంటే కృతకృత్యుడు.
విజ్ఞతను ప్రదర్శించి ఏ సందర్భానికి ఎలా మాట్లాడితే అది తగినదని ప్రశంసిస్తారో, ఆ సందర్భంలో అలా మాట్లాడాలి. ఎప్పుడూ ఇతరుల మనస్సులు కష్టం కలిగేలా మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటివ్యక్తి మనస్సుకష్టపడకుండా ఉండాలి. ఇలా ప్రవర్తించేవాడు మాట్లాడటంలో కృతకృత్యుడయ్యినట్లే.
ఎప్పుడు తప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ
భావం : తనను సేవించేవారిలో ఎప్పుడు ఏ తప్పు దొరుకుతుందా అని నిరంతరం అన్వేషించే స్వభావం ఉన్న వ్యక్తిని సేవించగూడదు. అటువంటి వానిని సేవించటం అంటే, పాము పడగనీడలో కప్ప నివసించటం వంటిది.
ప్రతిపదార్ధం : ఎప్పుడు అంటే నిరంతరాయంగా. తప్పులు అంటే తనను సేవించేవారి తప్పులకోసం. వెదకెడు అంటే అన్వేషించే. ఆ + పురుషునిన్ అంటే ఆ వ్యక్తిని. కొల్వగూడదు అంటే సేవించకూడదు. అది అంటే ఆ సేవించటం. ఎట్లన్నన్ అంటే ఎటువంటిది అంటే. సర్పంబుఅంటే పాము యొక్క. పడగనీడను అంటే పడగ కింద ఉండేనీడలో. కప్ప అంటే కప్ప. వసించిన అంటే నివసించి ఉన్న. విధంబు గదరా అంటే పద్ధతి కదా నాయనా.
తన దగ్గర ఉంటూ, తనను సేవించే వ్యక్తి మీద నమ్మకాన్ని పెంచుకోవాలే కాని, సందేహించకూడదు. అలా సందేహించడం వల్ల ఏదో ఒకరోజు సేవించే వ్యక్తి మీద ద్వేషం బయలుదేరి, ఆ వ్యక్తిని అంతం చేసే స్థితి కలుగుతుంది. పాము పడగ నీడలో ఉన్న కప్పకు రక్షణ ఉండదు. ఏ క్షణంలోనైనా పాము ఆ కప్పను మింగేస్తుంది... అని ఒకరకమైన స్వభావం ఉన్న వ్యక్తుల గురించి కవి వివరించాడు.
ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతీ!
భావం: చెట్టు మీద నుంచి నేల మీదకు రాలిన పిందెలను ఒక్కటొక్కటిగా ఏరి తీసుకోవద్దు. ఆప్తులు, మిత్రులు, చుట్టాలు... వంటివారిని నిందించవద్దు. యుద్ధరంగం నుంచి పారిపోవద్దు. విద్యనేర్పే గురువులు, పెద్దల ఆజ్ఞను అతిక్రమించవద్దు.
ప్రతిపదార్థం: మేదినిన్ అంటే భూమి మీద. కసురు + కాయలు అంటే లేత పిందెలను (నేలపై రాలినవాటిని). ఏఱకుమీ అంటే ఏరి తీసుకోవద్దు. బంధుజనముల్ అంటే చుట్టాలైనవారిని. దూఱకుమీ అంటే నిందించవద్దు. రణము + అందునన్ అంటేయుద్ధంలో. పాఱకుమీ అంటే పారిపోవద్దు. గురువుల + ఆజ్ఞ అంటే చదువు గురువులు, పూజ్యులైనటువంటి వారి ఆనతిని. మీఱకుమీ అంటే దాటవద్దు. దోషము సుమ్మీ అంటే తప్పు సుమా!
పిందె నేల రాలిందంటే దానికి ఏదో ఒక తెగులు ఉందన్నమాట. లేదంటే అది చెట్టుమీద ఉండగానే పండుగా మారుతుంది. అందువల్ల నేల మీద రాలిన కాయలను తీసుకుని తినకూడదు. బంధువులంటే అవసరానికి ఆదుకునేవారు. అటువంటివారిని దూషించడం వల్ల వారు ఆపదలో ఆదుకోరు. అదేవిధంగా యుద్ధరంగం నుంచి పారిపోకూడదు. వీరుడు ‘విజయమో వీరస్వర్గమో’ అని యుద్ధరంగంలో తేల్చుకోవాలే కాని చేతకానివాడిలాగ పారిపోయి రాకూడదు. గురువులమాటను అతిక్రమించకూడదు. గురువు అంటే తల్లిదండ్రులు కావచ్చు, విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడు కావచ్చు. వారి కారణంగానే ఎవరికైనా జ్ఞానం కలుగుతుంది. అటువంటివారిని ఎదిరిస్తే అంతవరకు నేర్చుకున్నదంతా వృథాఅయిపోతుంది అని ఈ పద్యంలో కవి వివరించాడు.
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండ బెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!
శుభలగ్నమునందు అంటే మంచి సమయం చూసి పెట్టే సుముహూర్తంలో. కనకము + సింహ + ఆసనమునన్ అంటే సింహాకారంలో ఉన్న బంగారు రాజపీఠం మీద. శునకమున్ అంటే కుక్కను. కూర్చుండబెట్టి అంటే కూర్చుండేటట్లు చేసి. ఒనరన్ + కన్ అంటే ఒప్పునట్లుగా. పట్టము + కట్టినన్ అంటే రాజుగా పట్టాభిషేకం చేసినప్పటికీ. వెనుకటి అంటే సింహాసనం ఎక్కడానికి పూర్వం ఉన్న. గుణము అంటే స్వభావం. ఏల అంటే ఎందుకు. మానున్ అంటే పోతుంది! (పుట్టుకతో వచ్చినలక్షణం మధ్యలో ఎక్కడికీ పోదు). వినరా అంటే వినిపించుకుని అర్థం చేసుకో.
భావం : మంచి ముహూర్తం చూసి ఒక కుక్కను తీసుకొని వెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా పట్టాభిషేకం చేయవచ్చును. కాని అది దాని స్వభావ లక్షణాన్ని విడిచిపెట్టదు. (తినకూడని వాటిని తినడం వాటి లక్షణం). అంటే దాని పూర్వలక్షణాన్ని అది మానుకోలేదు. ఈ నీతిని జాగ్రత్తగా, శ్రద్ధతో వినవయ్యా. ఎవరు ఏమి చేసినప్పటికీ నీచునికి సహజంగా ఉండే నీచబుద్ధి ఎక్కడికీ పోదు.
ప్రతిప్రాణి కీ ఒక సహ జ లక్షణం ఉంటుంది. దానినే గుణం అంటారు. కొందరికి మంచి గుణాలు ఉంటాయి. మరికొందరికి చెడుగుణాలు ఉంటాయి. అవి వారికి సహజంగా వచ్చే లక్షణాలు. అంటే వాటిని ఎవరూ మార్చలేరు. ఈ విషయాన్ని కవి పైపద్యంలో వివరించాడు.
చీమలు పెట్టిన పుట్టలు
పాములకిరవైనయట్లు పామరుడు తగన్
హేమంబు కూడబెట్టిన
భూమీశుల పాల జేరు భువిలో సుమతీ!
భావం: చిన్నచిన్న చీమలు నిరంతరం కష్టపడి మట్టితో పుట్టలు నిర్మిస్తాయి. అయితే అందులో పాములు చేరి నివసిస్తాయి. తెలివితక్కువవాడు వివిధరకాలుగా కష్టపడి అత్యాశతో ధనం కూడబెడతాడు. అయితే అది చివరకు భూమీశులయినరాజుల ఆస్తిలో కలిసిపోతుంది.
ప్రతిపదార్థం: భువిలోన్ అంటే ఈ భూమి మీద; చీమలు అంటే అతి చిన్నప్రాణి అయిన చీమలు. పెట్టిన అంటే నిర్మించిన; పుట్టలు అంటే చీమల పుట్టలు. పాములకున్ అంటే విషసర్పాలకు; ఇరవు అంటే నివసించడానికి అనువుగా; ఐన + అట్లుఅంటే మారిన విధంగా. పామరుడు అంటే మూర్ఖుడు లేదా తెలివితక్కువవాడు; తగన్ అంటే అత్యాశకు తగ్గట్లుగా లేదా ధనదాహంతో. హేమంబు అంటే బంగారం, సంపద; కూడన్ + పెట్టినన్ అంటే సంపాదించి, ఖర్చుచేయకుండా అలాగే ఉంచితే; భూమి + ఈశుల అంటే భూమిని పరిపాలించే రాజుల; పాలన్ అంటే సంపదలో. చేరున్ అంటే కలిసిపోతుంది. మానవులు తమకు తగినంత మాత్రమే సంపాదించుకుని, దానిని సక్రమంగా ఖర్చు చేయాలి. అలా చేసినంతకాలం ఏ ఇబ్బందీ ఉండదు. అలాకాక తిండి మానుకుని సంపాదించినదంతా దాచుతూ ఉంటే ఏదో ఒకనాటికి అది ప్రభుత్వం పాలుకాక తప్పదు. అందుకే మనిషి తగినంత మాత్రమే సంపాదించాలి కాని, తరతరాలకు సరిపడా సంపాదించి కూడపెట్టడం వల్ల ఉపయోగం లేదనిఈ పద్యంలో కవి వివరించాడు.
కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగనేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!
భావం: ఇద్దరి మధ్య స్నేహం, అభిమానం, ప్రేమ వంటివి ఉన్న రోజులలో ఒకరిలో ఉన్న దోషాలు, తప్పులు మరొకరికి కనిపించవు. ఏదైనా కారణం వల్ల ఎప్పుడైతే ఆ స్నేహం, అభిమానం, ప్రేమ ద్వేషంగా మారతాయో, అప్పుడు ఎదుటివారిలోఉన్న దోషాలు, అపరాధాలు మాత్రమే కనిపిస్తాయి. ఇది వాస్తవం.
ప్రతిపదార్థం: కూరిమి అంటే స్నేహం, అభిమానం, ప్రేమ. కల దినములలో అంటే ఉన్న రోజులలో. నేరములు అంటే తప్పులు, దోషాలు, అపరాధాలు. ఏ + నాడును అంటే ఎప్పుడూ. కలుగన్ + నేరవు అంటే కంటికి కనిపించవు. మరి అంటే ఆతరువాత. ఆ కూరిమి అంటే అంతవరకు ఉన్న స్నేహం, అభిమానం, ప్రేమ. విరసంబు అంటే విద్వేషంగా. ఐనను అంటే మారిన పక్షంలో. నేరములు +ఏ అంటే తప్పులు మాత్రమే. తోచుచున్ + ఉండున్ అంటే కనిపిస్తుంటాయి. నిక్కము అంటేవాస్తవం.
బద్దెన మనుషులలోని సహజస్వభావాన్ని ఇందులో చాలా చక్కగా వివరించాడు. ఎవరితోనైనా స్నేహంగా ఉన్నంతకాలం వారిలోని తప్పులేవీ కనిపించవు. అంటే తప్పులు కూడా ఒప్పులుగానే కనిపిస్తాయి. అదే ఆ వ్యక్తితో వైరం ఏర్పడితే, ఒప్పులు కూడా తప్పుగానే కనిపిస్తాయని కవి ఈ పద్యంలో బోధించాడు.
కమలములు నీటబాసిన
గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
దమ తమ నెలవులు దప్పిన
దమ మిత్రులు శత్రులగుట తథ్యము సుమతీ!
భావం : పద్మాలు నీటిలో పుట్టి నీటిలోనే పెరుగుతాయి. నీరే వాటికి నివాసం. ఒకవేళ ఆ నీటి నుంచి పద్మాలు బయటపడితే పద్మబాంధవుడుగా ప్రసిద్ధికెక్కిన సూర్యుడికాంతి (ఎండ) సోకి వాడిపోతాయి. అలాగే సొంత చోటును విడిచిపెట్టినవారికిస్నేహితులే శత్రువులుగా మారతారు.
ప్రతిపదార్థం : కమలములు అంటే పద్మాలు. నీటన్ + పాసినన్ అంటే నీటి నుంచి బయటకు వచ్చి. కమల + ఆప్తుని అంటే కమలాలకు బంధువైన సూర్యునియొక్క. రశ్మి అంటే కాంతి లేదా ఎండ. సోకి అంటే తగలటం చేత. కమలిన అంటేకందిపోయిన లేదా వడలిపోయిన. భంగిన్ అంటే విధంగా. తమ అంటే వాటి యొక్క సొంతమైన. నెలవులు అంటే స్థానాలు. తప్పినన్ అంటే తొలగితే. తమ మిత్రులు అంటే తమ స్నేహితులే. శత్రులు +అగుట అంటే శత్రువులుగా మారటం. తథ్యము అంటే జరిగి తీరుతుంది (సత్యము).
ఎవరైనా సరే దేనినీ అతిక్రమించకూడదు. పరిధిదాటి ప్రవర్తిస్తే ప్రమాదాలు సంభవిస్తాయి. మితిమీరి ప్రవర్తించడం వల్ల ఎంతో చనువుగా ఉండే స్నేహితులు సైతం శత్రువులుగా మారతారు. అందుకే ఎప్పుడూ హద్దుమీరి ప్రవర్తించకూడదని కవి ఈపద్యంలో వివరించాడు.
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!
భావం : తనకు ఉన్న కోపమే తనకు హాని చేసే శత్రువు. తనలో ఉన్న శాంతగుణమే తనకు రక్షగా ఉంటుంది. ఇతరుల దుఃఖాన్ని పోగొట్టటానికి తాను చేసే పనే తనకు బంధువు, చుట్టం. తనకు ఉండే సంతృప్తే స్వర్గం అంటే సంతోషాన్ని కలిగించేచోటుతో సమానం. తనకు ఉన్న బాధే దుఃఖాలను, ఇబ్బందులను కలిగించే స్థానమని విజ్ఞులు చెబుతుంటారు.
ప్రతిపదార్థం : తన కోపము + ఎ అంటే తనకి ఉన్న కోపమే. తన శత్రువు అంటే ఆ ప్రాణికి పగవాడు. తన శాంతము + ఎ అంటే తనలో ఉన్న నెమ్మదితనమనే లక్షణమే. తనకు రక్ష అంటే తనకు రక్షణనిస్తుంది.
దయ అంటే ఇతరుల కష్టాలను పోగొట్టటానికి ప్రయత్నం చేయటం. చుట్టంబు + ఔన్ అంటే బంధువు లేదా చుట్టం అవుతుంది. తన సంతోషము + ఎ అంటే తనకు ఉండే సంతృప్తే. స్వర్గము అంటే కష్టాలు లేకుండా కేవలం సుఖం మాత్రమే ఉండేదేవలోకం. తన దుఃఖము + ఎ అంటే తనకు ఉండే బాధే. నరకము అంటే కష్టాలకు నెలవైన నరకం (పాపాలు చేసినవారికి శిక్షపడే చోటు) తో సమానం. అండ్రు అంటే అంటారు లేదా చెబుతారు తథ్యము అంటే ఇది వాస్తవం.
కోపంతో ఉన్న మనిషి పశువుతో సమానం. ఏం చేస్తున్నదీ వారికే తెలియదు. ఆ కోపంలో విచక్షణ పోగొట్టుకుంటారు. కోపం తగ్గిన తరవాత తాము చేసిన తప్పు ఏంటో తెలుసుకుంటారు. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోతుంది. అందువల్ల కోపాన్ని అణచుకుంటే మంచిదని ఈ పద్యంలో కవి వివరిస్తున్నాడు.
తనయూరి తపసి తనమును
తన పుత్రుని విద్య పెంపు దన సతి రూపున్
తన పెరటిచెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ!
భావం : ఎంత వివేకం ఉన్న మనుష్యులయినప్పటికీ సొంత ఊరికి చెందిన తపశ్శక్తి సంపన్నుడినీ, కన్న కొడుకు ప్రదర్శించే తెలివితేటలను, సొంత భార్య అందచందాలను, ఇంటి పెరడులో ఉన్న చెట్టుయొక్క ఔషధగుణాలను మనస్సులో కూడామెచ్చుకోరు.
ప్రతిపదార్థం : తన + ఊరి అంటే తను నివసించే గ్రామానికి చెందిన. తపసి అంటే తపస్సు చేసే వాని యొక్క. తపమును అంటే తపస్సును. తన పుత్రుని అంటే తన సొంత కుమారుని యొక్క. విద్య పెంపున్ అంటే చదువులో గల తెలివితేటలను. తన సతి అంటే తన భార్య యొక్క. రూపున్ అంటే సౌందర్యాన్ని. తన పెరటి అంటే తన ఇంటి పెరడులో ఉన్న. చెట్టుమందును అంటే ఔషధ వృక్షాలను. ఎట్టి అంటే ఎంత వివేకం ఉన్న. మనుజులున్ అంటే మనుష్యులు అయినప్పటికీ. మనసునన్అంటే చిత్తంలో. వర్ణింపరు అంటే ప్రశంసించరు లేదా మెచ్చుకోరు.
పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుంది... అని సామెత ఉండనే ఉంది. తమ కుమారుడు ఎంత తెలివిగలవాడైనప్పటికీ, పక్కింటి అబ్బాయిని మెచ్చుకుంటారు. తమ గ్రామంలోనే ఎంతో పండితుడు ఉన్నప్పటికీ అతడిని గుర్తించరు. తన భార్య ఎంతఅందంగా ఉన్నా కూడా పక్కింటి భార్య అందాన్నే పొగుడుతారు. అలాగే తమ ఇంట్లోనే ఔషధవృక్షం ఉన్నా కూడా దానిని ఔషధంగా అంగీకరించరు. అందుకే పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదు అని, దూరపుకొండలు నునుపు అని అంటారు. అందుబాబులో ఉన్నవాటిని నిర్లక్ష్యం చేసి అందని ద్రాక్షల కోసం ప్రయత్నించడం మానవ లక్షణం. ఈ పద్యంలో కవి ఆ విషయాన్ని వివరించాడు.
తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
భావం: పాముకి దాని పడగలో విషం ఉంటుంది. తేలుకి కొండిలో ఉంటుంది. కాని మనిషికి మాత్రం తల, తోక అనే భేదం లేకుండా శరీరమంతా ఉంటుంది.
ప్రతిపదార్థం: విషము అంటే గరళం. ఫణికిని అంటే పడగ ఉండే పాముకు. తలన్ అంటే పడగలో ఉండే కోరలలో. ఉండున్ అంటే ఉంటుంది. వృశ్చికమునకున్ అంటే తేలుకు. వెలయన్ + కాన్ అంటే స్పష్టమయ్యేటట్లుగా. తోకన్ అంటే తోకలోమాత్రమే. ఉండున్ అంటే ఉంటుంది. ఖలునకున్ అంటే చెడ్డవానికి. తల తోక యనక అంటే అక్కడ ఇక్కడ అనే భేదం లేకుండా. నిలువు + ఎల్లన్ అంటే శరీరమంతటా విషం ఉంటుంది. కదా అంటే కదయ్యా!
పాముకి కోరలు తీసేస్తే ఇంక దాని శరీరంలో ఎక్కడా విషం ఉండదు. అదేవిధంగా తేలుకి తోక తీసేస్తే దాని శరీరంలోనూ ఇంకెక్కడా విషం ఉండదు. కాని మనిషికి మాత్రం అలా కాదు. అక్కడ ఇక్కడ అనే భేదం లేకుండా దుష్టుని శరీరమంతా విషంవ్యాపించి ఉంటుంది అని దుర్గుణాలు ఉన్న మనుషుల గురించి కవి ఈ పద్యంలో వివరించాడు.
పాలను గలిసిన జలమును
పాల విధంబుననె యుండు బరికింపంగా
బాల చవి జెఱచు గావున
బాలసుడగు వాని పొందు వలదుర సుమతీ!
భావం : పాలలో కలిసిన నీళ్లు కూడా చూడటానికి పాలలాగానే తెల్లగా ఉంటాయి. కాని ఆ నీరు పాలలో కలిసినందువల్ల పాలకు ఉండే సహజమైన రుచి పోతుంది. దుర్మార్గుడు చూడటానికి మంచివానిగా, వివేకం కలవానిగా కనిపిస్తాడు. కానిమంచివానిలో ఉండే సజ్జన గుణాన్ని పోగొడతాడు. కనుక చెడ్డవానితో స్నేహం ఎంత మాత్రం పనికిరాదు.
ప్రతిపదార్థం : పాలను అంటే తెల్లని రంగులో ఉండే పాలతో. కలిసిన అంటే కలిసినటువంటి. జలమును అంటే నీరు కూడా. పరికింపన్ + కాన్ అంటే చూడటానికి. పాలవిధంబునన్ + ఎ అంటే తెల్లని పాలలాగానే. ఉండున్ అంటే ఉంటాయి. పాలచవిన్ అంటే పాలకు ఉండే సహజమైన రుచిని. చెరచున్ అంటే పాడుచేస్తాయి. కూడా. కావునన్ అంటే అందువలన. పాలసుడు + అగువాని అంటే దుర్మార్గుడు అయిన వానితో. పొందు అంటే స్నేహం. వలదుర అంటే వద్దయ్యా. పాలల్లో నీళ్లుకలవటం వల్ల నీళ్లకు పాల రంగు వస్తుంది. కాని ఆ నీళ్లు పాల రుచిని చెడగొడతాయి. అంటే ఎంతో స్వచ్ఛమైన పాలు నీటి కలయిక వల్ల ఆ స్వచ్ఛతను కోల్పోతాయి. అదేవిధ ంగా చెడ్డవారితో స్నేహం చేయడం వల్ల మంచివాడు తప్పనిసరిగాచెడిపోతాడు. సిరి అబ్బకపోయినా, చీడ అబ్బుతుందనే మాట లోకంలో ప్రసిద్ధిగా ఉంది. అందువల్లే దుష్టునికి దూరంగా ఉండమని కవి ఈ పద్యంలో వివరించాడు.
పెట్టిన దినములలోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
పెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!
పెట్టిన దినములలోపలన్ అంటే ఇతరులకు దానం చేసిన రోజులలో; నడు + అడవులకున్+ ఐనన్ అంటే దట్టమైన అడవుల మధ్యభాగంలో ఉన్నప్పటికీ; నానా + అర్థములున్ అంటే కావలసిన ద్రవ్యాలన్నీ; వచ్చున్ అంటే దొరుకుతాయి; పెట్టనిదినములన్ అంటే ఇతరులకు దానం చేయని రోజులలో; కనకము + గట్టు అంటే బంగారంతో నిండిన కొండ ను; ఎక్కినన్ అంటే అధిరోహించినప్పటికీ; ఏమి అంటే అనుభవించదగినదేదీ; లేదు + కదరా అంటే ఉండదు కదయ్యా!
భావం : ఇతరులకు దానం చేసిన రోజులలో దట్టమైన అరణ్యమధ్యభాగాలలో ఉన్నప్పటికీ అక్కడ కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి. అదే ఇతరులకు దానం చేయని రోజులలో అయితే బంగారపు కొండ మీద ఉన్నప్పటికీ అక్కడఅనుభవించదగినదేదీ దొరకదు కదా! కనుక ఉన్నంతలో ఇతరులకు దానం చేయాలి.
ఇతరులకు పెట్టనిదే మనకు పుట్టదని ఒక సామెత ప్రచారంలో ఉంది. మనకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలి. చేయమన్నారు కదా అని అపాత్రదానం చేయకూడదు. మనం సంపాదించిన దానిలో ఎనిమిద వ వంతు ఇతరులకుదానం చేయాలని శాస్త్రం చెబుతోంది. కనుక వీలయినంతగా అవసరంలో ఉన్నవారికి దానం చేయవలసిందిగా కవి ఈ పద్యం ద్వారా నొక్కి చెప్పాడు.
పాలసునకైన యాపద
జాలింబడి తీర్ప దగదు సర్వజ్ఞునకున్
దేలగ్ని బడగ బట్టిన
మేలె ఱుగునె మీటుగాక మేదిని సుమతీ!
పాలసునకున్ అంటే చెడుస్వభావం కలవానికి; ఐన + ఆపదన్ అంటే కష్టం లేదా విపత్తు కలిగినప్పుడు; జాలిన్ +పడి అంటే జాలి వహించి, కనికరంతో; తీర్పన్ అంటే ఆపదను పోగొట్టటం; సర్వజ్ఞునకున్ అంటే అన్నీ తెలిసినవానికి; తగదు అంటేఅంటే మంచిదికాదు; మేదినిన్ అంటే ఈ భూమి మీద; తేలు అంటే తోకలో విషం కలిగి ఉండిన వృశ్చికం; అగ్నిన్ అంటే మంటలో; పడన్ + కన్ అంటే పడిపోయినప్పుడు; పట్టినన్ అంటే దానిని చేతితో పట్టుకొంటే; మీటున్ + కాక అంటే కుడుతుందేకాని; మేలు+ ఎరుగును + ఏ అంటే చేసిన సహాయాన్ని గుర్తిస్తుందా?(గుర్తించదు)
భావం: చెడుస్వభావం కలవాడు ఆపదలలో చిక్కుకున్నప్పుడు, అన్నీ తెలిసిన జ్ఞాని జాలిపడి, దుర్జనుడిని ఆపద నుంచి రక్షించడానికి ప్రయత్నించకూడదు. తేలు మంటలో పడినప్పుడు జాలిపడి, దానిని చేతితో పైకి తీసి పట్టుకుంటే, అదికుడుతుందే కాని, తనను రక్షించాడు కదా అని కుట్టకుండా ఉండదు.
‘అపాత్రదానం’ అనే నానుడి వాడుకలో ఉంది. ఎప్పుడైనా అవసరంలో ఉన్నవారికి దానం చేస్తే దాని ఫలితం ఉంటుంది. అంతేకాని, అడిగిన వారికల్లా దానం చేస్తూ ఉంటే ఆ దానం దురుపయోగం అవుతుంది. మనిషికైనా, జంతువుకైనా, పక్షికైనా... దేనికైనా దాని సహజస్వభావం ఉంటుంది. అది పుట్టుకతో వస్తుంది. పుడకలతోనే పోతుంది. అందువల్ల చెడుస్వభావం ఉన్నవారిని రక్షించినందువల్ల మిగిలినవారికి కూడా చెడు జరుగుతుందే కాని వారివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, అనికవి ఈ పద్యంలో వివరించాడు.
బంగారు కుదువ బెట్టకు
సంగరమున బాఱిపోకు సరసుడవైనన్
అంగడి వెచ్చము లాడకు
వెంగలితో జెలిమి వలదు వినరా సుమతీ!
భావం: నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే నేను చెప్పే నీతిని శ్రద్ధగా విను. అవసరానికి బంగారం తాకట్టు పెట్టకు. యుద్ధరంగం నుంచి పారిపోవద్దు. ఇంటికి కావలసిన నిత్యావసరాలను దుకాణంలో అప్పుపెట్టి తీసుకోవద్దు. మంచి,చెడు విచక్షణలేనివానితో స్నేహం చేయవద్దు.
సరసుడవు + ఐనన్ అంటే ఆనందంగా ఉండాలనుకుంటే; బంగారు అంటే బంగారాన్ని; కుదువన్ + పెట్టకు అంటే తాక ట్టు పెట్టవద్దు; సంగరమునన్ అంటే యుద్ధభూమి నుంచి; పారిపోకు అంటే పలాయనం చేయకు. అంగడిన్ అంటే దుకాణంలో; వెచ్చములు + ఆడకు అంటే ఇంటికి కావలసిన నిత్యావసరాలను అరువు మీద తీసుకోవద్దు.
వెంగలితోన్ అంటే విచక్షణ లేనివానితో; చెలిమి అంటే స్నేహం; వ లదు అంటే మంచిదికాదు; వినరా అంటే వినవయ్యా. ప్రతివారూ జీవితంలో పైకి ఎదగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అలా పాటించడం వల్ల జీవితం హాయిగా నడుస్తుంది. అంతేకాక కీర్తిప్రతిష్ఠలు సంపాదించి పెడుతుంది. ఇందులో... బంగారం తాకట్టు పెట్టవద్దు, దుకాణంలో అరువుకి సరుకులు తీసుకోవద్దు... ఈ రెండింటినీ పాటిస్తే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రావు. అలా కాకపోతే అప్పులపాలవుతారు. అందువల్ల వీటిని పాటించమని చెప్పాడు. యుద్ధరంగంలో రాజు పారిపోతుంటే సైనికులు బలహీనులైపోతారు. వారిని శక్తిమంతులుగా ఉంచాలంటే రాజు తప్పనిసరిగా యుద్ధం రంగం నుంచి పారిపోకూడదు. చెడ్డవానితో స్నేహం చేయడం వల్ల ఎన్నినష్టాలో అందరికీ తెలిసినదే. తాడిచెట్టు కింద నిలబడి పాలు తాగినా కల్లు తాగినట్లే భావిస్తారు. అందువల్ల మంచిపద్ధతులను అలవర్చుకుంటే జీవితం హాయిగా సాగుతుందని కవి ఈ పద్యంలో వివరించాడు.
మంత్రిగల వాని రాజ్యము
తంత్రము చెడకుండ నిలుచు దరచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపు గీలూడినట్లు జరగదు సుమతీ!
భావం: మంత్రుల సలహాతో పాలించే దేశంలో, ప్రజలకు పాలకులకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. అందువల్ల రాజ్యం సుస్థిరంగా ఉంటుంది. అలాకాక మంత్రి సలహాలు, సూచనలు తీసుకోకుండా పరిపాలించే రాజ్యం ఇబ్బందుల్లోచిక్కుకుంటుంది. యంత్రాలలో భాగాలు సులభంగా అటూ ఇటూ తిరగటానికి వీలుగా ఏర్పరచిన మర జారిపోతే ఆ యంత్రం ఎందుకూ పనికిరాదు. మంత్రిసలహా లేని రాజ్యం కూడా అంతే.
ప్రతిపదార్థం: ధరలో అంటే భూమి మీద; తరచుగన్ అంటే ఎక్కువగా; మంత్రి అంటే మంచి సలహాలను ఇచ్చే తెలివితేటలు గల అధికారి; కలవాని అంటే ఉన్నటువంటి రాజు యొక్క; రాజ్యము అంటే ప్రభువుల పరిపాలనకు లోబడిన దేశం; తంత్రము అంటే ప్రజలకు పాలకులకు ఉపయోగపడే ఉపాయం; చెడక + ఉండన్ అంటే చెడిపోకుండా; నిలుచున్ అంటే నిలబడుతుంది; మంత్రివిహీనుని అంటే మంచి సలహాలు ఇచ్చే మంత్రిలేని రాజ్యం; జంత్రము + కీలు అంటే యంత్రంలోఅటూఇటూ సులువుగా తిరగటానికి వీలుగా ఉంచిన మర; ఊడిన + అట్లు అంటే జారి పడిపోయిన విధంగా; జరగదు అంటే సరిగా ఉండదు.
రాజులకు దేహబలం అధికంగా ఉంటుంది. అయితే, కేవలం దేహబలంతో రాజ్యపరిపాలన చేస్తే సరిపోదు. అందుకే ఆ దేహబలానికి బుద్ధిబలం తోడవ్వాలి. అప్పుడు ఆ దేశం సుసంపన్నంగా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు తన మంత్రి అప్పాజీసలహాలు, సూచనల మేరకు రాజ్యాన్ని పరిపాలించిన కారణంగానే ఆయన పరిపాలనాకాలం స్వర్ణయుగంగా నిలిచింది. అందుకే మంత్రుల సలహా తీసుకోవటం అవసరమని కవి ఈ పద్యంలో వివరించాడు.
మానఘనుడాత్మ ధృతిసెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలముల లోపల
నేనుగు మెయి దాచినట్టు లెరుగుము సుమతీ!
ప్రతిపదార్థం: మానఘనుడు అంటే మంచి ప్రవర్తనతో అందరి మన్ననలు పొందినవాడు; ఆత్మన్ అంటే మనస్సులో; ధృతి చెడి అంటే ధైర్యం నశించిపోయి; హీనుండు అంటే నీచుడు; అగువానిన్ అంటే అయినవానిని; ఆశ్రయించుట అంటే శరణుకోరిచేరటం; ఎల్లన్ అంటే సమస్తమూ; మానెడు అంటే రెండు సేర్ల పరిమాణాన్ని కొలవటానికి ఉపయోగించే కొలపాత్ర (అంటే స్వల్పమైన); జలముల లోపలన్ అంటే నీటిలో; ఏనుగు అంటే తొండం కలిగి ఉన్న గజం; మెయి అంటే తన శరీరాన్ని; దాచిన + అట్టులు అంటే కనపడకుండా దాచినట్లుగా; ఎరుగుము అంటే తెలుసుకో.
భావం: మంచి మనసు ఉన్నవారు కూడా ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం కారణంగా ఒక నీచుడిని ఆశ్రయించవలసి వస్తుంది. అలా ఆశ్రయించటం అంటే పెద్దశరీరం కల ఏనుగు... రెండుసేర్ల నీటిలో తన శరీరాన్ని దాచాలని ప్రయత్నించడం వంటిదనిగుర్తెరుగు!
మనుషుల గొప్పదనం వారి మనస్సును బట్టి ఉంటుంది. మనిషికి మంచితనమే ప్రధానం. ధనం, సంపద, అధికారం, కీర్తి... వంటివి ఎన్ని ఉన్నా మంచిమనసు లేనినాడు అవన్నీ వృథా. ప్రాణంతో సమానమైన మానం విడిచిన నాడు ప్రాణం లేనిశరీరంతో సమానం. ఉత్తములైనవారు మానం కోరుకుంటే, మధ్యములు సంధి కోరుతారు. అధములు కలహం కోరతారు. అందుకే ఉత్తములైనవారు ఎంత ఆపదలో ఉన్నప్పటికీ నీచుడి సహాయం కోసం ప్రయత్నించకూడదని ఈ పద్యం అంతార్థం.
రారమ్మని పిలువని యా
భూపాలుని గొల్వ భుక్తి ముక్తులు గలవే
దీపంబు లేని ఇంటను
చే పుణికిళ్లాడినట్లు సిద్ధము సుమతీ!
ప్రతిపదార్థం: రా అంటే రమ్మని; పొమ్ము అంటే వెళ్లమని; పిలువని అంటే ర మ్మని, పొమ్మని పలుకరింపని; ఆ భూపాలునిన్ అంటే అటువంటి పరిపాలకుడిని; కొల్వన్ అంటే సేవించటం వలన; భుక్తిముక్తులు అంటే ఇహపరసుఖాలు; కలవు + ఏఅంటే ఉంటాయా? (ఉండవు); దీపంబు అంటే కాంతినిచ్చే దివ్వె; లేని + ఇంటను అంటే లేనటువంటి ఇంటిలో; చే అంటే చేతితో; పుణికిళ్లు అంటే తడుముకోవటం; ఆడిన + అట్లు అంటే చేసిన విధం; సిద్ధము అంటే వాస్తవం.
భావం: రమ్మని, వెళ్లమని నోరారా పలకరించని ప్రభువును సేవించటం వల్ల ఇహపర భోగం, మోక్షం రెండూ కలగవు. ఇది దీపపు కాంతి లేని ఇంట్లో వస్తువు కోసం చేతితో తడుముకోవడం వంటిది. ఈ విషయం అనుభవం కారణంగా తెలిసినవాస్తవం.
కొలువులో పనిచేస్తున్నప్పుడు ఆ కొలువుకు ఉండే అధికారి తమ దగ్గరున్న ఉద్యోగి కష్టనష్టాలను, యోగక్షేమాలను నిరంతరం తెలుసుకుంటూండాలి. అప్పుడు ఆ ఉద్యోగి మరింత మెరుగైన సేవలు అందించగలడు... అని పద్యం అంతరార్థం.
వరపైన చేను దున్నకు
కరవైనను బంధుజనులకడ కేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ
భావం : అనావృష్టి ఏర్పడినప్పుడు, పొలం దున్ని సాగు ప్రయత్నం చేయకూడదు. ఎంత కరవుకాలం వచ్చినప్పటికీ బంధుజనులను ఆశ్రయించకూడదు. సన్నిహితులు కాని వారయిన ఇతరులకు, శత్రువులకు గుట్టుగా ఉంచవలసినరహస్యాలను చెప్పవద్దు. ధైర్యం లేనివారిని సైన్యాధికారిగా నియమించవద్దు.
ప్రతిపదార్థం : వరపైన అంటే ఎండలు కాసే సమయంలో (వానాకాలం కానప్పుడు); చేను అంటే పొలాన్ని; దున్నకు అంటే సాగుచేయకు; కరవు + ఐనను అంటే క్షామం వచ్చినప్పటికీ; బంధుజనుల కడకున్ అంటే చుట్టాల దగ్గరకు సహాయంకోసం; ఏగకుమీ అంటే వెళ్లవద్దు; పరులకున్ అంటే సన్నిహితులు కానివారికి (ఇతరులకు, శత్రువులకు); మర్మం అంటే గుట్టుగా ఉంచవలసిన రహస్యాలను; చెప్పకు అంటే చెప్పవద్దు; పిరికికిన్ అంటే ధైర్యం లేనివారిని (పిరికివానికి); దళవాయితనమున్ అంటే సైన్యాధికారిగా; పెట్టకు అంటే నియమించవద్దు.
ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు సమయం అనుకూలంగా లేకపోతే... ఆ పనిని వాయిదా వేయాలి. అంతేకాని ఏటికి ఎదురీది పని చేయాలనుకోకూడదు. కరవు ఏర్పడినప్పుడు ఎన్నో కష్టాలుపడి ఆకలి తీర్చుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. అలా కష్టపడాలే తప్ప, చుట్టాల ఇంటికి వెళ్లి వారి ఆశ్రయం పొందాలనుకోకూడదు. ఎందుకుంటే దాని వల్ల వారి మధ్య చుట్టరికం దెబ్బతినే అవకాశం ఉంటుంది.
అలాగే ఏ మాత్రం బలం లేనివారిని సైనికాధికారిగా నియమిస్తే సైన్యం కూడా బలహీనపడుతుంది. ఇక చివరగా... రహస్యాలను ఇతరులకు చెప్పటం వలన ఊహించని పరిణామాలు కలుగుతాయి. ‘పెదవి దాటితే పృథివి దాటుతుంది’ అనే సామెతఉండనే ఉంది. అందుకే రహస్యాన్ని కడుపులోనే ఉంచుకోవాలని పెద్దలు చెబుతారు. ఇలా... ఏయే పనులు చేయకూడ దో కవి ఈ పద్యంలో వివరించాడు.
సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చుట కొఱకె తథ్యము సుమతీ!
భావం : మనసుకు ఆనందం కలిగించేలా మాట్లాడటం, చేష్టలు చేయటం... ఇవన్నీ దుఃఖం కలగటానికే. పరిపూర్ణ సుఖం కలగటం అంటే ఎక్కువ కష్టాలు అనుభవించటానికే. వృద్ధి చెందటం అంటే క్షీణించటం కోసమే. ఒక వస్తువు ధర తక్కువకావటం అంటే పెరగటం కోసమే. ఇది వాస్తవం.
ప్రతిపదార్థం : సరసము అంటే ఆనందం కలిగించేలా మాట్లాడటం, పనులు చేయటం; విరసము కొరకే అంటే బాధలు కలగటం కోసమే; పరిపూర్ణ అంటే పూర్తిస్థాయిలో; సుఖంబులు అంటే సౌఖ్యాలు; అధిక అంటే ఎక్కువ కావటం, బాధల కొరకే అంటేకష్టాల కోసమే; పెరుగుట అంటే వృద్ధిచెందటం; విరుగుట కొరకే అంటే నశించిపోవటానికే; ధర అంటే వెల; తగ్గుట అంటే తగ్గటం; హెచ్చుట కొరకే అంటే అధికం కావటం కోసమే; తథ్యము అంటే వాస్తవం.
జీవితంలో కష్టసుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. కష్టాలకు కుంగిపోవడం, సుఖాలకు పొంగిపోవడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. అధిక ధనం వచ్చింది కదా అని గర్వంతో విర్రవీగకూడదు. అది కొన్నిరోజుల తరవాత మన దగ్గరనుంచి వెళ్లిపోవచ్చు. అలాగే ఇబ్బందులలో ఉన్నామని కుంగిపోకూడదు. ఆ ఇబ్బందులు కూడా ఎన్నో రోజులు ఉండవు. కొన్నాళ్ల తరవాత సుఖాలు వరిస్తాయి. అందుకే ‘పెరుగుట తరుగుట కొరకే’ అనేది నిత్య జీవితంలో వాడుకలోకి వచ్చింది. ఇందుకు చంద్రుడు చక్కని ఉదాహరణ - పదిహేను రోజులకుఒకసారి పౌర్ణమి వస్తే, మరో పదిహేను రోజులకు అమావాస్య వస్తుంది. అదే జీవితం. సుఖదుఃఖాలు రెండింటినీ సమదృష్టితో చూస్తూ స్థితప్రజ్ఞత చూపాలని కవి ఈ పద్యంలో వివరించాడు.
Post a Comment